Home » POLITICS » స్వచ్ఛ్ భారత్ మిషన్ అమలు కోసం రాష్ట్రాలతో కలసి MDWS ముమ్మర కృషి

స్వచ్ఛ్ భారత్ మిషన్ అమలు కోసం రాష్ట్రాలతో కలసి MDWS ముమ్మర కృషి

దేశంలోని అన్ని జిల్లాలలో బహిరంగ ప్రదేశాలలో మల మూత్ర విసర్జన నివారణ లక్ష్య సాధ‌న కోసం తాగు నీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ (ఎమ్ డి డబ్ల్యు ఎస్)   రాష్ట్రాలతో కలసి తన కృషిని ముమ్మరం చేసింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన కార్యక్రమాలలో ఒకటైన స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద ఈ మంత్రిత్వ శాఖ చేపడుతున్న కార్యకలాపాలలో ఇది ఒక భాగంగా ఉంటోంది. ఈ కార్యక్రమం ద్వారా మహాత్మా గాంధీ 150వ జయంతి సంవత్సరమైన 2019లో అక్టోబరు 2 నాటికల్లా భారతదేశంలో ఆరుబయలు ప్రదేశాలలో మలమూత్ర విసర్జన జరగకుండా చూడాలన్న (ఓపెన్ డిఫాకేషన్ ఫ్రీ.. ఒ డి ఎఫ్) లక్ష్యాన్ని సాధించాలన్నది ప్రభుత్వ కృత‌నిశ్చ‌యంగా ఉంది.

ఇందుకోసం ముమ్మరం చేసిన ప్రయత్నాలలో భాగంగా తాగు నీరు మరియు పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాద‌వ్ ఈ వారం మొదట్లో పంజాబ్ లోని మొహాలి లో ‘జల సప్తాహం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంజాబ్ ను ఓపెన్ డిఫాకేషన్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేటందుకు ప్రజల ప్రమేయంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు పారదర్శకమైన పద్ధతిలో వాస్తవ లబ్ధిదారుల వద్దకు చేరుకొనేటట్లుగా చూస్తున్నదంటూ ఆయన తన అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా పంజాబ్ లో రమారమి 13000 పాఠశాలల నుంచి 11 లక్ష‌ల‌ బడి పిల్లలకు ఈ కృషిలో పాలు పంచుకొనే అవకాశాన్ని కల్పించి, వారిని ‘స్వచ్ఛతా దూతల’ ను చేసినందుకు మంత్రి ప్రత్యేకంగా మెచ్చుకొన్నారు.

ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో మంత్రిత్వ శాఖ ఒక పరంపరగా జరుపుతున్న సమావేశాలలో భాగంగా ఈ శాఖ కార్యదర్శి శ్రీ పరమేశ్వరన్ అయ్యర్ ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి  చంద్రశేఖర రావు తోను, ఇంకా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల తోను సమావేశమయ్యారు. అంతే కాకుండా, వాస్తవ పరిస్థితులపై అవగాహన కోసం, ‘ఒ డి ఎఫ్ ఇండియా బై 2019’   అనే లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహాయపడగలదో తెలుసుకోవడం కోసం ఈ రెండు రాష్ట్రాల జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను కూడా నిర్వహించారు.

రాష్ట్రాలకు బాసటగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఈ సంవత్సరం చివరికల్లా ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం 3 జిల్లాలను ఒ డి ఎఫ్ గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం కంకణం కట్టుకొందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ శర్మ మరొక సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఏడాది ఆఖరుకు కనీసం 3 జిల్లాలను ఒ డి ఎఫ్ జిల్లాలుగా మలచుతామని ఎమ్ డి డబ్ల్యు ఎస్ కార్యదర్శికి హామీ ఇచ్చారు. ఈ దిశగా రెండు రాష్ట్రాల కృత‌నిశ్చ‌యాన్ని ఎమ్ డి డబ్ల్యు ఎస్ కార్యదర్శి అభినందించారు. ఈ విషయంలో తమ మంత్రిత్వ శాఖ మద్దతు తప్పక ఉంటుందని ఆయన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి హామీనిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*